2015లో ప్రపంచం ఆరాధించిన మహిళామణులు!

tyjiui

కాలగతిలో మరో సంవత్సరం గడిచిపోనుంది. ఈ సంవత్సరం మహిళలు ఎంతో మంది తమ సత్తాను చాటారు. ప్రపంచం సైతం ఎందరినో ఆరాధించింది. పురుషులకు తామెంత మాత్రమూ తీసిపోమని ఎందరో నిరూపించారు. ఈ నేపథ్యంలో 2015 సంవత్సరంలో మహిళలను గౌరవించిన సందర్భాలు, మన్ననలు పొందిన, నిత్యమూ వార్తల్లో నిలిచిన యువతుల వివరాలు…
సౌదీలో మహిళా కౌన్సిలర్లు: ఇస్లాం నిబంధనలు కఠినంగా అమలయ్యే సౌదీలో ఇటీవలి కాలం వరకూ మహిళలకు ఓటు హక్కే లేదు. అటువంటిది వారు ఓటు హక్కు పొందడమే కాదు, చట్ట సభల్లోనూ అడుగుపెట్టి, సౌదీ మారిందని నిరూపించారు. మహిళా సాధికారత దిశగా సౌదీ మరో అడుగు ముందుకేసిందని ప్రపంచానికి చాటారు.
ప్యాట్రికా అక్వెట్టీ: మూడు సార్లు ఆస్కార్ అవార్డు పొందిన మెరిల్ స్ట్రీప్ తో పోటీ పడి ఉత్తమ సహాయ నటిగా అవార్డును పొందింది ప్యాట్రికా అక్వెట్టీ. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “దేశానికి పన్ను చెల్లించే పౌరులను కంటున్న మహిళలు సమాన హక్కుల కోసం నిత్యమూ పోరాడాల్సి వస్తోంది. ఈ దిశగా అమెరికా ముందడుగు వేసి సమాన వేతనాలను కల్పించడం ద్వారా, స్త్రీ, పురుషుల మధ్య దూరాన్ని తగ్గించాలి” అని ప్రసంగించి, మరింత మందిలో ఈ విషయమై చర్చించేలా చేసింది.
జాస్మిన్ గొలుబొవాస్కా: ఈ యువతి ‘లిప్ స్టిక్ ప్రొటెస్టర్’ అంటే సులువుగా గుర్తొచ్చేస్తుంది. ఒకే ఒక్క ఫోటో, ఈమెను రాత్రికి రాత్రే సెలబ్రిటీగా చేసింది. మెసిడోనియా ప్రధాని నికోలా గృయ్ వస్కీ, అతని క్యాబినెట్ కు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతున్న వేళ, ఓ పోలీసు ధరించిన షీల్డ్ ను అద్దంగా చూస్తూ, తన అందమైన పెదాలకు లిప్ స్టిక్ పూసుకుంటూ కనిపించింది. ఆ చిత్రం సామాజిక మాధ్యమాల్లో ఎంతగానో హల్ చల్ చేసింది. చిత్రాన్ని తీసిన ఫోటో గ్రాఫర్ కు ఎన్నో బహుమతులను తెచ్చిపెట్టింది.
సానియా మీర్జా, మార్టీనా హింగిస్: టెన్నిస్ ప్రపంచంలో ఈ సంవత్సరం కచ్చితంగా ఈ జోడీదే. వీరిద్దరి జోడీ రెండు గ్రాండ్ స్లామ్ లను, మరెన్నో చిన్న టైటిళ్లను గెలుచుకుంది. దీంతో ఈ జోడీ మహిళల డబుల్స్ విభాగంగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. 2016లోనూ అదే జోరు కొనసాగించాలన్నది వీరి అభిమతం.
సైనా నెహ్వాల్: బ్యాడ్మింటన్ క్రీడలో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుని భారత ప్రతిభను మరోసారి ప్రపంచం ముందుంచింది. ఈపై వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగానూ చరిత్ర సృష్టించింది.
దీపికా పదుకొనే: ఫోర్బ్స్ టాప్ 10 సెలబ్రిటీల జాబితాలో నిలిచిన ఈ బాలీవుడ్ అందాల సుందరి సంవత్సరమంతా ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే వచ్చింది. ఒత్తిడిలో ఉన్నవారికి సహాయకంగా ఉండేలా ‘లివ్, లవ్, లాఫ్’ ఫౌండేషన్ నుంచి, ‘మై చాయిస్ వీడియో’, కంగనా రౌనత్ తో వివాదం, ఆపై ట్రిపుల్ ఎక్స్ స్టార్ విన్ డీజిల్ తో చిత్రాలు, సంవత్సరం చివర్లో బాజీరావు మస్తానీ చిత్రం… మొత్తం మీద 2015లో అభిమానులు దీపికను బానే ఆదరించారు.
ఏంజెలా మెర్కెల్: టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందారీ జర్మన్ చాన్స్ లర్. 2015లో ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ చోటు సంపాదించారు.
అంగ్ సాన్ సూకీ: మయన్మార్ చరిత్రను తిరగరాయాలని, సైనిక పాలనకు అంతం పలకాలని దశాబ్దాలుగా పోరాడుతున్న ధీర వనితగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజల్లో కొత్త ఆశలను నిలిపారు.
ఇలా ఎంతో మంది మహిళలు తమ సత్తాను చాటి ఈ యేడాది ప్రపంచ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.

About

View all posts by

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *